Sunday, October 30, 2022

Important points Importance of Guntur

Important points Importance of Guntur 'గుంటూరు చరిత్ర' * (సమాచార సేకరణ : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు) గుంటూరు అంటే మిరపకాయ బజ్జీలు, జిన్నా టవరు, గోలీ సోడా లేక శంకర్ విలాస్ మాత్రమేనా? శతాబ్దాల చరిత్ర నా గుంటూరు .... ధాన్యకటకం రాజధానిగా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే విశాల సామ్రాజ్యాన్ని ఏలిన శాతవాహనుల చరిత్ర నా గుంటూరు. వీరికి కోటిలింగాల, జున్నూర్ అనే ప్రాంతాలలో కూడా రాజధానులు ఉండేవి. కవిత్రయంలోని తిక్కన నడయాడిన చరిత్ర నా గుంటూరు. మాచర్ల చెన్నకేశవుడి ఆశీస్సులతో ౘాపకూడు సిధ్ధాంతం ద్వారా సామాజిక న్యాయం కోసం నిలబడ్డ పల్నాటి బ్రహ్మనాయుడి చరిత్ర నా గుంటూరు. కృష్ణరాయలుకే కొఱుకుడు పడని కొండవీటి రెడ్డి రాజుల చరిత్ర నా గుంటూరు. అష్ట దిగ్గజాలకే తలమానికమైన రామకృష్ణ కవి నా గుంటూరు. 'కృష్ణం కలయసఖి సుందరం బాల కృష్ణం కలయసఖి సుందరం' అంటూ 'తరంగాలు' అందించిన నారాయణ దాసు నా గుంటూరు. అమరావతి కేంద్రంగా సుపరిపాలన అందించిన రాజా వాసిరెడ్డి వేంకట్రాది నాయుడు చరిత్ర నా గుంటూరు. ముచుకుంద మహర్షి తపమాచరించిన గుత్తికొండ బిలం నా గుంటూరు. త్రేతాయుగంనాటిదని పేరు గాంచిన సీతానగరం నా గుంటూరు. శిబి చక్రవర్తి తన తొడను కోసి పావురాన్ని రక్షించిన క్షేత్రం కపోతేశ్వరాలయమున్న చేజెర్ల చరిత్ర నా గుంటూరు. అక్కరలో ఉన్నవారిని చేదుకునే కోటయ్య వెలసిన పుణ్య క్షేత్రం కోటప్పకొండ చరిత్ర నా గుంటూరు. పానకాల స్వామిగా వినుతికెక్కిన నృసింహ క్షేత్రం మంగళగిరి నా గుంటూరు. పంచారామాలలో ఒకటైన అమరావతి చరిత్ర నా గుంటూరు. వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న పాత గుంటూరు అగస్తేశ్వరాలయం నా గుంటూరు. ఇరవై నాలుగు అడుగుల ఆంజనేయుడు అండగా నిలబడిన పొన్నూరు నా గుంటూరు. పేరెన్నికగన్న భావనారాయణుడు కొలువైన బాపట్ల నా గుంటూరు. అనంతపద్మనాభుడు కొలువైన ఉండవల్లి గుహలు నా గుంటూరు. సుదూర తీరాలనుండి వచ్చే వలస పక్షలు సంరక్షణ కేంద్రం ఉప్పలపాడు నా గుంటూరు. ఆంగ్లో-ఫ్రెంచ్ యుధ్ధం జరిగిన ప్రాంతం (నేటి హిందూ కాలేజ్ ఉన్న ప్రాంతం) నా గుంటూరు. 'నీరు పెట్టావా, నారు పోసావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఎందుకు కట్టాలిరా శిస్తు?' అని బ్రిటీషు వారిని ఎదుర్కొని ముప్ఫై ఏళ్ళ ప్రాయంలోనే కన్నెఱ్ఱ చేసి ప్రాణత్యాగం చేసిన కన్నెగంటి హనుమంతు చరిత్ర నా గుంటూరు. సామాజిక ఆనాచారం వల్ల శివ దర్శనానికి నోచుకోని ఒక అభాగ్యుడి వేదనను 'గబ్బిలం' ద్వారా వినిపించిన మహా కవి జాషువా చరిత్ర నా గుంటూరు. కొప్పరపు కవుల చరిత్ర నా గుంటూరు. పువ్వులంటే ముచ్చట పడే మహిళల చేతనే కన్నీరు పెట్టించిన కరుణశ్రీ నా గుంటూరు. సంస్కృతాంధ్ర భాషల్లో అగ్రగణ్యులైన జమ్మలమడక మాధవరాయశర్మ, శ్రీ కృష్ణాచార్యుల చరిత్ర నా గుంటూరు. ప్రవచనాలకు నాంది పలికిన బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి నా గుంటూరు. మహా కవులు, రచయితలు అయిన 'తెలుగులెంక' తుమ్మల సీతారామశాస్త్రి, సత్యం శంకరమంచి, మునిమాణిక్యం నరసింహారావు, కొడవటిగంటి కుటుంబరావు, చలం, కవిరాజు త్రిపురనేని రామస్వామి, రాయప్రోలు సుబ్బారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతారావు, పండిత సత్యదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, ప్రముఖ రచయిత సంజీవ దేవ్, అధరాపురపు తేజోవతి, పాపినేని శివశంకర్, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఓల్గా, దేవీప్రియ, శార్వరి వంటి వారిని కన్న నేల నా గుంటూరు. జ్ఞానపీఠ్ ఎవార్డు గ్రహీత రావూరి భరద్వాజను కన్న నేల నా గుంటూరు. వేయి వసంతాల మానవ జీవన యానం, చరిత్రకెక్కని స్వాతంత్ర్య సమరయోధుల గురించి వ్రాసి నాకు మార్గదర్శకం చేసిన మా నాన్న గారు స్వర్గీయ విఠల్ రావు గారు నా గుంటూరు చరిత్ర. మాంటిస్సొరి ఎడ్యుకేషన్ కు నాంది పలికి ఈనాడు మహావృక్షమైన శ్రీ వేంకటేశ్వర బాల కుటీర్, చేతన, ఉషోదయ, సంధ్యారాగం, రక్ష వంటి సంస్థల వ్యవస్థాపకులు మంగాదేవి గారు నా గుంటూరు. ఎమ్సెట్ లేని రోజుల్లో మెడికల్ ఎంట్రన్స్ కు కోచింగ్ ఇవ్వడంద్వారా తెలుగునేల అంతా చిరపరిచితమైన సింహం శ్రీ చతుర్వేదుల విశ్వనాధమ్ ఎలియాస్ సివియన్ ధన్ గుంటూరు. నాటక రంగంలో లబ్దప్రతిష్టులైన స్థానం నరసింహారావు, ఏ.వి. సుబ్బారావు, ఈలపాట రఘురామయ్య, కాళిదాసు కోటేశ్వరరావు, స్థానం వారి తరువాత స్త్రీ పాత్రలలో స్థానం సంపాదించిన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, మాడభూషి వేంకట శేషాచారిలను అందించిన నేల నా గుంటూరు. శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహా సన్నిధానం నా గుంటూరు. కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిధ్ధేశ్వరానంద భారతి స్వామి నా గుంటూరు. క్రీస్తు పూర్వం రెండు వందల ఏళ్ళ నాడే అబ్రకాన్ని కనుగొన్న భౌతిక వాది, బౌధ్ధుడు, రసాయనిక శాస్త్రాన్ని ఔపోసన పట్టిన నాగార్జునుడి చరిత్ర నా గుంటూరు. సూర్య మండలంలో హీలియమ్ గ్యాస్ ను కనుగొన్న చరిత్ర నా గుంటూరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూరు వజ్రానికి పుట్టినిల్లు నా గుంటూరు. బుఱ్ఱకధా పితామహుడు నాజర్ నా గుంటూరు. బౌధ్ధ భిక్షువులకు ఆలవాలమైన భట్టిప్రోలు చరిత్ర నా గుంటూరు. బ్రహ్మదేవునికి ఉన్న రెండే రెండు దేవాలయాల్లో ఒకటైన చేబ్రోలు నా గుంటూరు. చేత వెన్న ముద్ద తో దర్శనమిచ్చే ప్రపంచంలోని ఏకైక శ్రీ కృష్ణ దేవాలయం ఉన్న సొలస గ్రామం నా గుంటూరు. బ్రిటీషు వారి తుపాకులకు ఎదురొడ్డి నిల్చిన ఆంధ్రకేసరి పుట్టినిల్లు అలనాటి నా అవిభాజ్య గుంటూరు. కోట్ల విలువైన ఆస్థిని స్వాతంత్ర్యం కోసం దేశానికి ఇచ్చివేసిన దేశభక్త కొండా వెంకటప్పయ్య నా గుంటూరు. చీరాల-పేరాల ఉద్యమాన్ని నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నా గుంటూరు. మూడు సార్లు నిషేధానికి గురైన నవల 'మాలపల్లి' రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నవ లక్ష్మీ నారాయణ నా గుంటూరు. బాల వితంతువులను చేరదీసి విద్యాబుధ్ధులు గరిపి గౌరవప్రదమైన బ్రతుకులను ఇచ్చిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ నా గుంటూరు. నిస్వార్ధ సేవకు నిరుపమానమైన ఉదాహరణ వావిలాల గోపాలకృష్ణయ్య నా గుంటూరు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మునిసిపల్ ఆఫీసుపై మువ్వన్నెల ౙండా ఎగురవేసి బ్రిటీష్ అధికారాన్నే సవాలు చేసిన నడింపల్లి నరసింహారావు నా గుంటూరు. రైతు లేనిదే దేశం లేదని అహర్నిశలు వారి శ్రేయస్సుకై పాటుబడ్డ గోగినేని రంగనాయకులు (N.G.Ranga) నా గుంటూరు. ఐదుగురు ముఖ్యమంత్రులను, నలుగురు అసెంబ్లీ స్పీకర్లను అందించిన చరిత్ర నా గుంటూరు. కేంద్ర కేబినెట్ లో ఒకే సమయంలో ఒకే జిల్లానుండి ఇద్దరు మంత్రులు ఉన్న ఏకైక జిల్లా నా గుంటూరు. పొగాకు, మిర్చి, పత్తి, పసుపు వంటి వాణిజ్య పంటలకు నెలవు నా గుంటూరు. శాకంబరీదేవీ ప్రసాదం, ఆంధ్రశాకం గోంగూర నా గుంటూరు. భగభగ మంటలు మండించే మిరప్పళ్ళ కారం నా గుంటూరు. గలగలా పారే కృష్ణమ్మ కెరటాలతో సస్యశ్యామలమైన కృష్ణా డెల్టా నా గుంటూరు. విద్యారంగానికి పంచ మాతృకలుగా విరాజిల్లుతున్న 135 సంవత్సరాల ఆంధ్ర క్రైస్థవ కళాశాల, వంద సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ కళాశాల, యాభై సంవత్సరాల వయసున్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల, తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సోమసుందరం కళాశాల, (మునిసిపాలిటీ ఆధ్వర్యంలో మహిళలకు కళాశాల ప్రారంభించి, తరువాత బ్రిటీష్ ప్రభుత్వానికి అంటగట్టిన లౌక్యుడు తెల్లాకుల జాలయ్య గారు) ప్రభుత్వ మహిళా కళాశాలల వైభవంతో Oxford of Andhra అని పేరుగన్నది నా గుంటూరు. దేశ విదేశాలలో స్థిరపడ్డ తెలుగు వైద్యులలో అధిక శాతం గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్ధులే అన్నది జగమెరిగిన సత్యం. అది నా గుంటూరు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ అంటే సామాన్య జనం నుండి కోటీశ్వరుడి వరకు అందరూ కోరుకునేదే. Guntur is considered as Medical Hub of AP. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ, ప్రొ॥ వాసిరెడ్డి శ్రీ కృష్ణ, ప్రొ॥కె.సచ్చిదానంద మూర్తి, ప్రతి ఇంటా వినిపించే సుందరకాండ ఎమ్మెస్ రామారావు, ప్రవచన కర్త శ్రీ మైలవరపు శ్రీనివాసరావు నా గుంటూరు. మెడికల్, ఇంజనీరింగ్ .... ఇప్పుడు CA కోచింగ్ లకు పుట్టినిల్లు నా గుంటూరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చార్టర్డ్ ఎకౌంటెంట్, ICFAI Founder Governor నండూరి జ్యోతిర్మయి యశస్వి (N J YASASWI) నా గుంటూరు. శాస్త్రీయ సంగీత దిగ్గజం మంగళంపల్లి బాల మురళి గారి గురువు, త్యాగరాజ స్వామి శిష్య పరంపరలో ఒకరైన పారుపల్లి రామకృష్ణయ్య, పురాణం పురుషోత్తమ శాస్త్రి, కొమండూరి శేషాద్రి, కర్లపాలెం చంద్రమౌళి మరియు వారి శిష్యులైన నాదస్వర విద్వాంసులు షేక్ సుభానీ, కాలీషా దంపతులు (పద్మశ్రీ అవార్డుల గ్రహీతలు), రాజనాల వేంకట్రామయ్య, వింజమూరి వరదరాజయ్యంగారు, సంస్కృతాంధ్ర పండితులు శ్రీమాన్ కొమండూరి సీతారామాచార్యులు నా గుంటూరు. సినీ ప్రముఖులైన చక్రపాణి, వేమూరి గగ్గయ్య, గోవిందరాజుల సుబ్బారావు, నాగయ్య, ముక్కామల, కాంచనమాల, ఛాయా దేవి, సావిత్రి, జమున, కొంగర జగ్గయ్య, శారద, ప్రభ, దివ్యవాణి, జయలలిత, సుమలత, రాగిణి, బాలయ్య, గుమ్మడి, ధూళిపాళ, డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ, ఏవియస్, వీర నరసింహాపుర అగ్రహారీకురాలైన భానుమతి, కొసరాజు రాఘవయ్య, ముదిగొండ లింగమూర్తి, సియస్సార్, వంగర వెంకట సుబ్బయ్య, కె. విశ్వనాధ్, గాన కోకిల ఎస్. జానకి, మాధవపెద్ది సత్యం, గోఖలే, బ్రహ్మానందం, జీవా, ప్రదీప్ శక్తి, బోయపాటి శీను, కొరటాల శివ, పోసాని, సంగీత 'చక్రవర్తి', గాయని సునీత, గాయకుడు మనో, సినీ రచయిత మాడభూషి దివాకర బాబు, సంగీత దర్శకుడు, గేయ రచయిత వోగేటి నాగ వేంకట రమణ మూర్తి (స్వర వీణాపాణి), హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి, సూర్యదేవర రామమోహనరావు, సినీ, టి.వి. సీరియల్ రచయితలు గూడూరు విశ్వనాధ శాస్త్రి, మాడభూషి వేంకటేష్, సినీ రచయితలు, దర్శకులు అయిన బుర్రా సాయి మాధవ్, రాజేంద్ర భరద్వాజ, క్రిష్ జాగర్లమూడి, కే.యస్. రవీంద్ర, బయ్యవరపు వేంకటేశ్వరరావు, గుంటూరు శాస్త్రిగా ప్రసిధ్ధి చెందిన GSRK శాస్త్రి, నాటక, సినీ రచయిత ృశ్నేశ్వరరావు, నాటక రంగ ప్రముఖుడు నాయుడు గోపి నా గుంటూరు. పారిశ్రామికవేత్తలలో సుప్రసిధ్ధులైన వెలగపూడి రామకృష్ణ ICS నా గుంటూరు. యువ డాషింగ్ & రెబల్ క్రికెటర్ అంబటి రాయుడు నా గుంటూరు. చదరంగంలో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక నా గుంటూరు. పిడుగురాళ్ళ, రాగి నిక్షేపాల అగ్నిగుండాల, నరుకుళ్ళపాడు, ఫిరంగిపురం .... ఈ పేర్లు వింటేనే ప్రత్యర్ధికి కాళ్ళు వణుకుతాయి. అదీ నా గుంటూరు. శిల్పకళకు నెలవు దుర్గి నా గుంటూరు. విప్లవ నాయకుడు అక్కిరాజు హరగోపాల్ నా గుంటూరు. మొట్టమొదటగా 1913 లో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదించింది నా గుంటూరు .... గోంగూరంటే ముందుంటాం. మిరప్పళ్ళ కారం మాదేనంటాం. దేనికైనా ముందుంటాం .... మాటలో సూటిదనం, నిక్కచ్చితనం, పొగరు, విగరు ఉన్నదే నా గుంటూరు .... ఇంతటి ఘన చరిత్ర ఉన్న ప్రాంతాన్ని మీకు పరిచయం చేసిన #అధరాపురపు_మురళీ_కృష్ణ పుట్టి పెరిగిన ఊరు గుంటూరు .... ఇదీ గుంటూరు అంటే ....

No comments:

Post a Comment