Showing posts with label History in Telugu. Show all posts
Showing posts with label History in Telugu. Show all posts

Wednesday, April 5, 2023

Brief information about Puranas in Telugu

Brief information about Puranas in Telugu

ఏ పురాణంలో ఏముందో క్లుప్తంగా తెలుసుకుందాము🔥

1.మత్స్యపురాణం
2.కూర్మపురాణం
3.వామనపురాణం
4.వరాహపురాణం
5.గరుడపురాణం
6.వాయుపురాణం
7. నారదపురాణం
8.స్కాందపురాణం
9.విష్ణుపురాణం
10.భాగవతపురాణం
11.అగ్నిపురాణం
12.బ్రహ్మపురాణం
13. పద్మపురాణం
14.మార్కండేయ పురాణం
15.బ్రహ్మవైవర్తపురాణం
16.లింగపురాణం
17.బ్రహ్మాండపురాణం
18.భవిష్యపురాణం

ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

🐋మత్స్య పురాణం:*
మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.

🐢కూర్మ పురాణం:*
కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

👶వామన పురాణం:*
పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

🐷వరాహ పురాణం:*
వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

🦅గరుడ పురాణం:*
గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.

🌪వాయు పురాణం:*
వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

🔥అగ్ని పురాణం:*
అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.

🦚స్కంద పురాణం:*
కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

🔱లింగ పురాణం:*
లింగరూప శివ మహిమలతో బాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

🪕నారద పురాణం:*
బహ్మమానస పుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

🪷పద్మ పురాణం:*
ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజా విధానాల గురించి ఉంటుంది.

☸ విష్ణు పురాణం*
పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

🙏🏻మార్కండేయ పురాణం:*
శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

🕉 బ్రహ్మ పురాణం*
బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

🪈భాగవత పురాణం :
విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

🌍 బ్రహ్మాండ పురాణం*:
బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.

🪐భవిష్య పురాణం:*
సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

💫 బ్రహ్మావైపర్త పురాణము :
ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు,తులసీ, సాలగ్రామ మహత్మ్యం ఉంటాయి.
🙏🙏🙏🙏🙏
🔯⚛️☮️☸️✡️

Monday, July 25, 2022

t n sada lakshmi

t n sada lakshmi తెలంగాణ తొలి దళిత మహిళ శాసన సభ్యురాలు ,తొలితరం తెలంగాణ ఉద్యమకారిణి కి మనం ఇచ్చే గుర్తింపె ఆమెకు ఘన నివాళి ….జులై 24 న సదాలక్ష్మి గారి వర్ధంతి సందర్బంగా… మానవాళి సామాజిక వ్యవస్థను మనిషిగా అవగాహన చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా జాతి, వర్ణ ,లింగ, ప్రాంత, భాష లాంటి అనేక రకాల సామాజిక వివక్షతలు కనబడతాయి. అందులో భాగంగా భారతదేశంను చూస్తే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన అనేక రాష్ట్రాల యూనియన్ కి ఏకత్వం కలిగిన ఏకైక సామాజిక అంశం కుల వ్యవస్థ. కుల వ్యవస్థ అనే విషగర్భం నుండి పుట్టినదే స్త్రీలపై వివక్ష. అందుకే భారత సామాజిక వ్యవస్థను కూలంకశంగా పరిశోధన చేసిన మహనీయుడు అంబేద్కర్ ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయడానికి మహిళల అభివృద్ధిని కొలమానంగా తీసుకుంటానని అని చెప్పారు. దళిత ఉద్యమం తర్వాత భారత మహిళా విముక్తికై పోరాడుతూనే హిందూ కోడ్ బిల్లు విషయంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అంబేద్కర్ గారు భారతదేశ ముఖ్యమైన సమస్యలుగా భావించి ఉద్యమం చేసిన కుల , లింగ వివక్షత అనే రెండింటినీ ప్రత్యక్షంగా ఎదుర్కొని నిలబడిన నాయకురాలు సదాలక్ష్మి. తద్వారా ఈమెను అంబేద్కర్ ఉద్యమం నుండి ఆవిర్భవించిన తెలంగాణ దళిత మహిళా సాధికారతకు తొలి గుర్తుగా భావించవచ్చు. మాదిగ సామాజిక వర్గంలో మెహతార్ అనే మలం ఎత్తి పోసే వృత్తిని చేసే ఉపకులంలో జన్మించి కుల మరియు లింగ వివక్షతను ఎదుర్కొని పాలకురాలిగా , పోరాడే ఉద్యమాలకు తల్లిగా నాయకత్వం వహించి మాతృస్వామ్య వ్యవస్థ కు తన వ్యక్తిత్వమే ప్రతిరూపకంగా నిలిచి సామాజిక, రాజకీయ రంగాలలో తమ అభివృద్ధికి స్త్రీలు పోషించాల్సిన పాత్రను తన జీవితం ద్వారా మనకు తెలియజేస్తుంది. 1928 డిసెంబర్ 25వ తేదీన హైదరాబాదులోని పెన్షన్ పుర లో కొండయ్య, గోపమ్మ దంపతులకు సదాలక్ష్మి గారు జన్మించారు. ఈమె భర్త ప్రముఖ విద్యావేత్త, దళిత నాయకుడు టీ. వీ నారాయణ గారు వీరికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు సంతానం కలదు. బ్రిటిష్ అధికారులు నివసించే కంటోన్మెంట్ ప్రాంతంలో పెరగడం వల్ల భారత సామాజిక వ్యవస్థలో స్త్రీలకు దూరంగా ఉంచ బడిన చదువు, ఆటల్లో ఈమె ముందు ఉండటానికి కంటోన్మెంట్ పరిస్థితులు దోహదపడ్డాయి. ప్రాథమిక విద్య బొల్లారం ప్రైవేట్ స్కూల్లో మరియు కీస్ హైస్కూల్లో చదివి, మాస్టర్స్ ని క్వీన్ మేరీస్ ఉమెన్స్ కాలేజీ మద్రాసులో పూర్తి చేసింది. చిన్నతనం నుండే కుటుంబ ప్రోత్సాహం తో పాటు తో పాటు అరిగే రామస్వామి, ముదిగొండ లక్ష్మయ్య , పులి నరసింహులు దళిత నాయకులు మార్గదర్శనం చేశారు. నాటి నాయకుల్లో ఎక్కువ మంది నాయకులు గాంధేయవాదులు గా ఉన్నప్పటికి సదాలక్ష్మి గారు అంబేద్కర్ మరియు జగ్జీవన్ రామ్ ల సామాజిక ఉద్యమాలలో పాల్గొనకుండా ఉండలేకపోయింది. *జీరా కాంపౌండ్ లో అంబేద్కర్ గారి ఉపన్యాసం ప్రత్యక్షంగా విని తన ఆలోచనా విధానాన్ని మార్చుకొని మెడిసిన్ చదువుని వదులుకొని ఉద్యమ భావజాలాన్ని, అన్యాయాన్ని ఎదిరించే గుణాన్ని సంపాదించి రాజకీయాలే లక్ష్యంగా పనిచేసి పని చేసింది. చదువుకు, పరిపాలనకు దూరమై సామాజిక వెలికి గురికాబడ్డ జాతి నుండి వచ్చి లింగ వివక్షకు గురవుతూనే చదువుకుని ,రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చి పరిపాలించి నేటి స్త్రీలకు మార్గదర్శనం అయింది. రాజకీయ జీవితం... 1940-1947 నుండి నిజాం రాష్ట్రంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంది. మామాల (మాల-మాదిగ) ఉద్యమంలో అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడింది. పెద్దపల్లి, కామారెడ్డి,ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుండి శాసనసభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించింది.1960-1962 మధ్యలో డిప్యూటీ స్పీకర్ గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వ్యవహరించింది. 1974-1980 మధ్యలో విధాన పరిషత్ సభ్యురాలు గా ఉంది 1982 లో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా భాద్యతలు చేపట్టింది. 1953 నుండి 1996 వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొంది. 1990 నుండి జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అండగా నిలిచింది. నీలం సంజీవరెడ్డి క్యాబినెట్ లో మొదటి మహిళా మంత్రిగా దేవాదాయశాఖ ను చేపట్టి హిందూ పురోహితులుగా దళితులకు శిక్షణ ఏర్పాటు చేసి విమర్శలు ఎదుర్కొని సామాజిక అసమానతలు రూపుమాపేందుకు పోరాడింది. యాదగిరిగుట్టలో అర్చక పాఠశాలను ఏర్పాటు చేసింది. దేవస్థానం ట్రస్టుల్లో మహిళలకు స్థానం కల్పించింది. సాంఘిక సంక్షేమ మంత్రిగా ఎస్సీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. 1980లో లిడ్ క్యాప్ గౌరవ చైర్మన్ గా ఉంది. డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ ,తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సదాలక్ష్మి గారు వర్ణాశ్రమ ధర్మ వివక్ష లో ఆమె శ్రమ, జ్ఞానం దాచివేయబడింది. తెలంగాణ ఉద్యమంలో… 1956 లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కె.వి.రంగారెడ్డి నాయకత్వంలో విశాలాంధ్రకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో సదాలక్ష్మి పాల్గొంది. 1968 విద్యార్థులు మొదలుపెట్టిన ఉద్యమానికి పెద్దదిక్కుగా అండగా నిలిచి, 1969 మార్చి 8 , 9 వ తేదీలలో తెలంగాణ కన్వెన్షన్ ను నిర్వహించి ఉద్యమ గమనాన్ని మలుపుతిప్పింది. ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంతమంతా విస్తరింపజేసి తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటులో కీలక పాత్ర వహించింది. ఉద్యమ సమయంలో మర్రి చెన్నారెడ్డి జైలులో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షురాలు గా ఉండి ఉద్యమాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించింది. ఇందిరాగాంధీ గారు మహిళా ప్రధానమంత్రిగా దేశానికి నాయకత్వం వహిస్తుంటే సదాలక్ష్మి గారు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి "వీర వనితలు వీర తిలకం దిద్దండి " అనే నినాదంతో మహిళా నాయకత్వంలో ఉద్యమాన్ని ఉదృతంగా నడిపించారు. సామాజిక ఉద్యమాలు రాజకీయాల్లో గాంధేయవాదిగా కొనసాగినప్పటికీ దళితురాలిగా,మహిళ గా తను ఎదుర్కొన్న వివక్ష మూలంగా అంబేద్కరిజం ప్రభావంతో సామాజిక ఉద్యమాల్లో పాల్గొనకుండా ఉండలేకపోయింది. అరుంధతియ మాతంగ మహాసభ, వాల్మీకి సభ, అరుంధతి సభ, బాబు జగ్జీవన్రామ్ వెల్ఫేర్ సొసైటీ, బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ లాంటి సంఘాలలో పని చేసింది. వర్గీకరణ ఉద్యమంలో మద్దతుగా నిలబడి 1992 లో నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఆది జాంబవ అరుంధతి మహాసభ ను నిర్వహించింది . మాదిగ ఉద్యోగుల కొరకు ఏర్పాటు చేసిన బందుసేవ మండలి లో వ్యవస్థాపక సభ్యురాలీగా ఉంది. వర్గీకరణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా, అమ్మగా సేవలు అందించింది. అణచివేయబడ్డ అనేక సామాజిక వర్గాలకు అస్తిత్వ, ఆత్మగౌరవ పోరాటాలకు రాజకీయేతర ఉద్యమంగా వర్గీకరణ ఉద్యమాన్ని నిలిపింది. “ఏ విషయంలో నేను నీకంటే ఏ విషయంలోనూ తక్కువ కాదు. మీ కులం కంటే నా కులం తక్కువ కాదు. నా కులం బ్రహ్మతో పోరాడింది. జాంబవంతుడు బ్రహ్మతో యుద్ధం చేసాడు - అది నా కులం. మీతో రాజీపడే ఉద్దేశం మాకు లేదు” అనే ఆమె మాటల్లో సాంస్కృతిక మూలాలు కనబడుతున్నాయి సాంస్కృతిక వారసత్వమే ఆమెను దైర్యంగా రాజకీయాల్లో నిలబెట్టింది అదే వారసత్వ సంస్కృతిని తెలంగాణ ప్రజలకు అందించాల్సిన భాద్యత మనపై ఉంది. “నా జాతి కోసం ఎలాంటి అవమానం మరియు బాధనైనా నేను భరించగలను. సముద్రాన్ని ఎంత దూరం అయినా ఈదగలిగే శక్తి నాకు చాలా ఉంది.” అనే మాటల్లో అన్యాయానికి గురవుతున్న అణచివేయబడుతున్న జాతి ఎదుగుదలే తన ఎదుగుదలగా భావించి జాతి అస్తిత్య్వమే తన మనుగడకు ప్రదానం అని ఉద్యమించింది. సదాలక్ష్మి అభిప్రాయంలో స్త్రీల శక్తి పురుషుల కంటే అధికం అని, స్త్రీల శక్తిని మేల్కొలిపితే సమాజం బాగుపడుతుంది అని పేర్కొంది. రాజకీయాల్లో దళిత ఉద్యమ కారిణిగా, కార్యకర్తలు ఆమెను అమ్మగా ' సదా లక్ష్మమ్మ' అని పిలుచుకునేవారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 'సదక్క ' అని పిలుచుకునేవారు . ఆమె మాతృస్వామిక వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనంగా మనకు కనబడుతుంది. పూజలు చేస్తరు, భగవద్గీత చదువుతారు, పేరున్న వారంతా చదువుతారు ఏమి సదువుతారు . కండ్ల ముందు ఉన్న మనుషులను చదువుడు నేర్చుకోవాలి అని స్పష్టంగా చెప్పింది ఆమె నేను స్త్రీ ని ఇతరులపై ఆధారపడాలన్న ధోరణి ఆమెకు ఏనాడూ లేదు. ఒక మహిళ అ భారత సామాజిక పరిస్థితులను ఎదుర్కొంటూ ఎలా జీవించాలి అనే దానికి నిదర్శనం సదాలక్ష్మి జీవితంఒక స్త్రీ యొక్క వ్యక్తిత్వమే ఆమె యొక్క అభివృద్ధిని నిర్ణయిస్తుంది, వ్యక్తిత్వం అనేది కుటుంబం మరియు సామాజిక పరిస్థితుల నుండి ఏర్పడుతుంది భారత దేశంలో సామాజిక పరిస్థితులు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే లాగా ఉంటాయిమాతృస్వామిక సంస్కృతికి చెందిన సామాజికవర్గ కుటుంబం నుండి వచ్చిన సదాలక్ష్మి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువు , ఆటల్లో చురుగ్గా ఎదిగి వైవాహిక, రాజకీయ జీవితంలో కులం లింగ వివక్షతను ఎదుర్కొంది. దానికి కారణం ఈ దేశం లో ఉన్నటువంటి ఆధిపత్యపు కుల అహంకార ధోరణి. దానిని ఎదుర్కొనేందుకు ప్రజాస్వామ్య ధోరణి అభివృద్ధికి తన వ్యక్తిత్వం ద్వారా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఒక్కదగ్గర ఉండలేక తన ప్రయాణాన్ని అభిప్రాయ భేదాల వల్ల వివిధ పార్టీలు ఉద్యమాలవైపు వెళ్లి తనే మూడు పార్టీలు స్థాపించింది. చివరి శ్వాస వరకు ప్రజాస్వామ్య పోరాట మార్గాన్నే ఎంచుకుని, కుల వివక్షతకు గురవుతున్న వర్గాలకు, లింగ వివక్షత కు గురవుతున్న మహిళల అభివృద్ధికి ఆమె జీవితమే ఆదర్శం. ప్రజా సేవే లక్ష్యంగా, ఉద్యమమే జీవితంగా బ్రతికిన సదాలక్ష్మి గారు 2004 జూలై 24 వ తేదీన 75 సంవత్సరాల వయస్సులో గుండె సంబంధిత సమస్యతో మరణించడం జరిగింది. తొలితరం తెలంగాణ ఉద్యమ కారిణిగా సామాజిక ఉద్యమాలకు మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచి తెలంగాణ చారిత్రక ఉద్యమ వారసత్వాన్ని భావితరాలకు అందించే విధంగా ప్రజల నుండి వస్తున్న డిమాండ్స్ అయినా విగ్రహాల ఏర్పాటు, వివిధ సంస్థలకు ఆమె పేరు పెట్టాలని ఇదివరకే ఉన్న డిమాండ్లను పరిశీలించి భావితరాలకు ఆమె పోరాట జీవితాన్ని స్ఫూర్తిగా అందించడమే మనమిచ్చే ఘనమైన నివాళి.