Mulki movement in Deccan Hyderabad State

Mulki movement in Deccan Hyderabad State

డెక్కన్ మరియు హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం - Download audio

పరిచయం

ముల్క్అనగా మాతృభూమి. హైదరాబాద్ రాష్ట్రంలోని స్థానిక ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలలో తమ హక్కుల కోసం ఇతర ప్రాంతాలనుండి వచ్చి స్థిరపడిన వారిపై పోరాడిన సంఘటనను ముల్కీ ఉద్యమం అంటారు. ఈ ఉద్యమం హైదరాబాద్‌లో మధ్యయుగం నుండి పలుమార్లు జరిగింది. ముల్కీ ఉధ్యమం బహమనీల కాలంలో మొదటిసారిగా జరిగింది. ఈ ఉద్యమం స్థానిక దక్కనీలు మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అపాకీల మధ్య సంఘర్షణల చరిత్రను వెల్లడిస్తుంది, ఇది సామాజిక, రాజకీయ మరియు భాషా సమస్యలతో ముడిపడి ఉంది.

బహమనీ కాలంలో ముల్కీ సంఘర్షణలు

ఖిల్జీలు మరియు తుగ్లక్‌ల దక్షిణ భారత దండయాత్రల సమయంలో, ఉత్తర భారతదేశం నుండి కొంతమంది హిందువులు మరియు ముస్లింలు హైదరాబాద్ రాష్ట్రంలో స్థిరపడ్డారు. వీరు స్థానిక దక్కనీలతో కలిసిపోయారు. బహమనీ సుల్తానుల పాలనలో, ఇరానీలు, ఇరాకీలు మరియు టర్క్-లు దక్షిణ భారతదేశానికి వచ్చి ప్రముఖ స్థానాలను ఆక్రమించారు. వీరిని అపాకీలు అని పిలిచారు. అపాకీలు వ్యాపారంలో స్థిరపడి, ప్రభుత్వ రాయితీలను ఉపయోగించుకొని ధనవంతులై, రాజ్యంలో ముఖ్యమైన పదవులను సంపాదించారు. దక్కనీలు రెండవ స్థాయి పౌరులుగా మిగిలిపోయారు. ఈ అసమానత దక్కనీలలో అసంతృప్తిని రేకెత్తించింది. సున్నీ మరియు షియా విభేదాలు ఈ సంఘర్షణను మరింత తీవ్రతరం చేశాయి, ఎందుకంటే అపాకీలు సున్నీలు, దక్కనీలు షియాలు. బహమనీ సైన్యంలోని సిపాయిలు దక్కనీలు కాగా, వారి సహాయ నిరాకరణ కారణంగా మొదటి అహ్మద్ షా గుజరాత్ తో యుధ్ధంలో ఓడిపోయాడు. మొదటి అహ్మద్ షా, రెండవ అహ్మద్ షా, మూడవ అహ్మద్ షా ల కాలంలో ప్రధానమంత్రి పదవులను అపాకీలు ఆక్రమించారు. మహ్మద్ గవాన్, ఒక అపాకీ. మూడవ అహ్మద్ షా ప్రధానమంత్రిగా మహ్మద్ గవాన్ సంక్షేమ చర్యలలో విజయవంతమైనప్పటికీ, బీదర్‌లో స్థాపించిన విశ్వవిద్యాలయంలో అపాకీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దక్కనీలు మరింత వెనుకబడ్డారు. ఈ అసమానత బహమనీ రాజ్య విచ్ఛిన్నానికి దారితీసింది.

కుతుబ్ షాహీల కాలంలో సామరస్యం

కుతుబ్ షాహీ వంశ స్థాపకుడైన కులీ కుతుబ్ షా, అపాకీ అయినప్పటికీ, దక్కనీలపై వివక్ష చూపలేదు. బహమనీ విచ్ఛిన్నం నుండి పాఠాలు నేర్చుకొని, అతను స్థానిక దక్కనీలకు ముఖ్యమైన పదవులను అప్పగించాడు మరియు తెలుగు భాషను ప్రోత్సహించాడు. అబుల్ హసన్ తానిషా కాలంలో అక్కన్న అనే ఒక హిందువు ప్రధానమంత్రిగా, అతని సోదరుడు మాదన్న పేష్కర్‌గా నియమించబడ్డారు. స్థానిక భాష మరియు సంస్కృతిని గౌరవించినందున, కుతుబ్ షాహీల కాలంలో ముల్కీ సంఘర్షణలు ఉత్పన్నం కాలేదు.

ఆసఫ్‌జాహీల కాలంలో ముల్కీ సమస్యలు

1857 తిరుగుబాటు తర్వాత మొఘల్ సామ్రాజ్యం తోపాటూ కొన్ని స్థానిక రాజ్యాలు అంతమయ్యాయి. ఉద్యోగాలు కోల్పోయిన అధికారులు, కళాకారులు, కవులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అది అప్పటికి శాంతియుత ప్రాంతంగా ఉంది. ఐదవ నిజాం అఫ్జల్ ఉద్దౌలా కాలంలో, ప్రధానమంత్రి సలార్‌జంగ్ హైదరాబాద్ 1882 లో సివిల్ సర్వీసెస్‌ను పరిచయం చేసి, అలీగఢ్ విశ్వవిద్యాలయం నుండి విద్యావంతులను ఆహ్వానించాడు. వారు స్థానికులకు శిక్షణ ఇవ్వాలని ఆశించినప్పటికీ, బదులుగా హైదరాబాద్‌లో స్థిరపడి, తమ బంధువులకు ఉద్యోగాలు వచ్చేలా చేసుకున్నారు. దీనివల్ల దక్కనీలు ప్రభుత్వ ఉద్యోగాలలో మైనారిటీగా మారారు, మరోసారి ముల్కీ మరియు నాన్-ముల్కీ సంఘర్షణ తలెత్తింది.

1880లో, ఆరవ నిజాం మహబూబ్ అలీ పాలనలో, ఉర్దూ అధికారిక భాషగా మారింది. ఆంగ్లం తప్పనిసరి భాషగా చేయబడింది. స్థానికులలో ఉర్దూ మరియు ఆంగ్లంలో నిష్ణాతులు తక్కువగా ఉండటం వల్ల, బయటి వారు ముఖ్య పదవులను ఆక్రమించారు. ఆంగ్లం మాట్లాడే వారికి ఎక్కువ వేతనం చెల్లించబడటం స్థానికులను మరింత వెనుకబాటుకు గురి చేసింది, దీనివల్ల ముల్కీ ఉద్యమం మళ్లీ ఉద్భవించింది. ప్రభుత్వం స్పెషల్ హైదరాబాద్ సివిల్ సర్వీసెస్‌ను పరిచయం చేసి, స్థానికులకు పదవులు ఇచ్చింది.

బ్రిటిష్ జోక్యం మరియు ముల్కీ ఉద్యమం

బ్రిటిష్‌వారు హైదరాబాద్ రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకోవడంతో, ఎక్కువ బ్రిటిష్ అధికారులను నియమించారు. కాసన్ వాకర్ 1912 వరకు ఆర్థిక మంత్రిగా ఉండి, నాన్-ముల్కీలను ఉద్యోగాలలో నియమించాడు. మహారాజా సర్ కిషన్ పర్షాద్ ముల్కీల హక్కుల కోసం పోరాడి, నాన్-ముల్కీలను తాత్కాలిక ఉద్యోగులుగా ప్రకటించేలా చేశాడు, స్థానికులకు ఉన్నత పదవులు వచ్చేలా చేసాడు. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపన తర్వాత, ఉత్తర భారతదేశం నుండి వచ్చిన పండితులు లక్నవీ ఉర్దూను ప్రామాణికంగా ప్రకటించి, దక్కనీ ఉర్దూను తక్కువగా చూశారు, ఈ భాషా ఆధిపత్యం 1948లో పోలీసు చర్య వరకు కొనసాగింది.

నిజాం ఫర్మానాలు మరియు ముల్కీ నియమాలు

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919 ఫర్మాన్ ముల్కీ నియమాలను నిర్దేశించింది. దీని ప్రకారం హైదరాబాద్‌లో జన్మించిన వారు మరియు 15 సంవత్సరాలు నిరంతరం నివసించి, స్వదేశానికి తిరిగి వెళ్లే ఉద్దేశ్యం లేని వారు ముల్కీలుగా పరిగణించబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ముల్కీలను మాత్రమే నియమించాలని 1933 ఫర్మాన్ మరోసారి నొక్కిచెప్పింది. 1934లో నిజాం ప్రజల సంఘంస్థాపించబడింది, సర్ నిజామత్ జంగ్ అధ్యక్షుడిగా, ‘హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్నినాదంతో ముల్కీల హక్కులను కాపాడింది.

ఆంధ్ర ప్రజల ఆగమనం మరియు సంఘర్షణ

1948 పోలీసు చర్య మరియు 1952 సాధారణ ఎన్నికల మధ్య, ఆంధ్ర ప్రాంతం నుండి చాలామంది హైదరాబాద్‌కు వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలలో చేరారు. మద్రాసు నుండి వెళ్ళగొట్టబడ్డ అవినీతి ఆంధ్ర అధికారులు తెలంగాణకు వచ్చి ఇక్కడ అవినీతపర కార్యక్రమాలు చేసేవారు. బ్రిటిష్ పాలనలో శిక్షణ పొందిన ఆంధ్ర వ్యక్తులు తెలంగాణ ఉద్యోగాలలో నియమించబడ్డారు. వారు తమ బంధువులను తీసుకొచ్చి వారికీ ఉద్యోగాలు వచ్చేలా చేసారు. కొందరు వ్యాపారాలు స్థాపించారు. ఆంధ్ర ప్రజలు ఉర్దూ మిశ్రిత తెలంగాణ తెలుగును అవమానించారు, తమను ఉన్నతమైన సంస్కృతి కలవారుగా, తెలంగాణవాసులను అనాగరికులుగా చిత్రీకరించారు. నకిలీ ముల్కీ సర్టిఫికెట్లతో ముల్కీ చట్టాన్ని ఉల్లంఘించారు. లంచం వంటి అవినీతిని ప్రోత్సహించారు.

వరంగల్‌లో ముల్కీ ఉద్యమం

వరంగల్ విద్యార్థులు ముల్కీ సర్టిఫికెట్ జారీ నియమాలు, నకిలీ సర్టిఫికెట్ల రద్దు, ధృవీకరణ తర్వాతనే ముల్కీ సర్టిఫికెట్ల జారీ కోసం ఉద్యమం ప్రారంభించారు. ఈ డిమాండ్లను కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ ఎ. బుచ్చయ్య తీర్మానంగా ప్రకటించాడు. ఆగస్టు 7న ఖమ్మం విద్యార్థులు కూడా నాన్-ముల్కీలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. వరంగల్‌లో డివిజనల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ పార్థ సారధి 180 మంది స్థానిక ఉపాధ్యాయులను బదిలీ చేసి, నాన్-ముల్కీ ఉపాధ్యాయులతో భర్తీ చేశాడు, దీనిని విద్యార్థులు ఖండించారు. 26 జూలై 1952న విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పడింది, బుచ్చయ్య కన్వీనర్‌గా ఎన్నికయ్యాడు. హన్మకొండ నుండి సుబేదారి వరకు ర్యాలీ నిర్వహించబడింది. రామచారి హైదరాబాద్ హిత రక్షణ సమితిని స్థాపించి, ‘గైర్ ముల్కీ గో బ్యాక్నినాదాన్ని ఇచ్చాడు. హయగ్రీవ చారి, కేశవరావు జాదవ్ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.

హైదరాబాద్‌లో ముల్కీ ఉద్యమం

31 ఆగస్టు 1952, హన్మకొండలో విద్యార్థులపై లాఠీ ఛార్జీకి నిరసనగా హైదరాబాద్ విద్యార్థులు సమ్మె నిర్వహించారు. సైఫాబాద్ కాలేజీ నుండి ఆబిడ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడింది. 1 సెప్టెంబర్ 1952, బక్రీద్ సందర్భంగా సమ్మెలు లేవు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ శివకుమార్ లాల్ విధ్యార్దుల తల్లిదండ్రులను హెచ్చరించాడు. 2 సెప్టెంబర్ 1952, ‘నాన్ ముల్కీ గో బ్యాక్’, ‘ఇడ్లీ సాంబార్ ఘర్ కో జావో’, ‘స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్నినాదాలతో విద్యార్థులు ఆందోళన చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని అన్ని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు 30 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ వరకు నిరసనల్లో పాల్గొన్నారు. 3 సెప్టెంబర్ 1952, శివకుమార్ లాల్ ఆందోళనలను నిషేధించాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ విద్యార్థులను నియంత్రించే ప్రయత్నం విఫలమైంది. సిటీ కాలేజీ, పత్తర్‌ఘాట్ వద్ద పోలీసులు కాల్పులు జరిపారు, జస్టిస్ పింగళి జగన్ మోహన్ రెడ్డి నివేదిక ప్రకారం ఇద్దరు మరణించారు. 4 సెప్టెంబర్ 1952, మృతదేహాల అప్పగింత కోసం ఆందోళనలు జరిగాయి. మరో నలుగురు కాల్పుల్లో మరణించారు. ఈ సంఘటనల్లో 147 విద్యార్థులు, 104 పోలీసులు గాయపడ్డారు. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు విద్యార్థులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఆందోళనలు ఆగలేదు. వీ.డీ. దేశ్ పాండే, ఓంకార్ ప్రసాద్, డాక్టర్ జయ సూర్య నాయుడు, పద్మజ నాయుడు, శ్రీ డాంగే, డాక్టర్ మెల్కోట్, బకర్ అలీ మిర్జా, వెంకట స్వామి నాన్-ముల్కీలకు మద్దతు ఇచ్చారు. బూర్గుల రామకృష్ణ రావు, స్వామి రామానంద తీర్థ నాన్-ముల్కీలకు అనుకూలంగా ప్రకటనలు ఇచ్చారు. సెప్టెంబర్‌ 3న ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. శాంతియుత ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు, దీనివల్ల ఇద్దరు విద్యార్థులు మరణించి, అనేకమంది గాయపడ్డారు. విద్యార్థులు పోలీసు స్టేషన్‌లను తగలబెట్టారు, దీనివల్ల కర్ఫ్యూ విధించబడింది. జయశంకర్, కాళోజీ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. మొత్తం 18 మంది కాల్పుల్లో మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. ప్రభుత్వం 350 మందిని అరెస్టు చేసి, హింసించింది, ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసింది.

ముగింపు

 ముల్కీ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో స్థానిక దక్కనీల హక్కుల కోసం శతాబ్దాలుగా సాగిన సంఘర్షణ. బహమనీల కాలంలో అపాకీల ఆధిపత్యం నుండి, కుతుబ్ షాహీల సామరస్య పాలన, ఆసఫ్‌జాహీల కాలంలో నాన్-ముల్కీల ఆగమనం వరకు, ఈ ఉద్యమం సామాజిక, రాజకీయ, భాషా అసమానతలను వెల్లడిస్తుంది. 1919, 1933 ఫర్మాన్లు, విద్యార్థుల ఆందోళనలు స్థానికుల హక్కులను కాపాడినప్పటికీ, 1952లో హింసాత్మక అణిచివేత ఈ పోరాటం యొక్క తీవ్రతను చూపిస్తుంది. ఈ ఉద్యమం తెలంగాణ గుర్తింపు మరియు స్వయంప్రతిపత్తి కోసం నిరంతర పోరాటానికి నిదర్శనంగా నిలిచింది.

Vandemataram movement in Nizam state

Vandemataram movement in Nizam state 

ప్రశ్న: హైదరాబాద్ రాష్ట్రంలోని వందేమాతరం ఉద్యమం (29 నవంబర్ 1938 నుండి 30 డిసెంబర్ 1940)

పరిచయం: download audio of this answer
వందేమాతరం ఉద్యమం భారత స్వాతంత్ర్య సమరంలో ఓ గొప్ప మలుపుగా నిలిచింది. దేశమంతటా ఈ పాట ఒక చైతన్య గీతంగా మారినప్పటికీ, హైదరాబాద్ రాష్ట్రంలో దీనిపై నిషేధం విధించబడటం విద్యార్థుల్లో ఆందోళనకు దారితీసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ పాట పాడిన విద్యార్థులు, ప్రభుత్వం దృష్టిలో తిరుగుబాటు కారులుఅయ్యారు. పాట ద్వారా వారు వ్యక్తీకరించిన ప్రేమ దేశం పట్ల గల నిజమైన అంకితభావాన్ని చూపించింది. ఈ ఉద్యమం యువకులలో ఉన్న దేశభక్తిని, తమ హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని ప్రపంచానికి చూపించింది. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు విద్యార్థి శక్తి ఇచ్చిన గట్టి సమాధానంగా ఈ ఉధ్యమం నిలిచింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవిర్భావం
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1917 ఏప్రిల్ 26న ఓ ఫర్మాను జారీ చేశారు, దీని ద్వారా ఓ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలన్న నిర్ణయం వెలువడింది. ఫలితంగా, 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. అనంతరం 1919 ఆగస్టు 28న ఆర్ట్స్ కళాశాల కార్యకలాపాలు ప్రారంభించాయి.

వందేమాతరం పాట పరిచయం
వందేమాతరంఅంటే తల్లికి వందనంఅని అర్థం. ఈ పాటను తొలుత దేవీ దుర్గమ్మకు అంకితంగా రచించారు. తరువాత దీన్ని భారత మాతకు అంకితంగా భావించారు. ఆనంద మఠ్అనే బంగ్లా నవల రచయిత బంకించంద్ర చటర్జీ దీనిని రచించారు. ఈ నవలలో వందేమాతరం పాట భాగంగా ఉంటుంది. వాసుదేవ్ బాలవంతరావ్ ఫడ్కే చేసిన స్వాతంత్ర్య పోరాటం ఆనంద మఠ్ నవలకు ప్రేరణగా నిలిచింది. ఈ నవల నేపథ్యం సంయాసి తిరుగుబాటు (Sanyasi Rebellion).

1896లో ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతరం పాటను తొలిసారిగా స్వరపరిచారు. ఇది భారతదేశంలోని స్వాతంత్ర్య సమరయోధులకు గొప్ప ప్రేరణగా నిలిచింది. 1905లో వారణాసిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో ఈ పాటను జాతీయ గీతంగా ప్రకటించారు. అదే సభలో సారలాదేవి చౌదురానీ ఈ పాటను ఆలపించారు. ఆ సమావేశానికి అధ్యక్షత వహించినవారు దాదాభాయ్ నౌరోజి.

హైదరాబాద్‌లో వందేమాతరం ఉద్యమం ఎలా ప్రారంభమైంది?
1938లో దసరా పండుగ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం B హాస్టల్ విద్యార్థులు వందేమాతరం పాటను ఆలపించారు. అయితే అంతకు మునుపే ఈ పాటపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. హాస్టల్‌లో ఉన్న హిందూ ప్రార్థనా మందిరంలో ఈ పాట పాడటాన్ని ముస్లిం విద్యార్థులు వ్యతిరేకించి యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూనివర్సిటీ అధికారులు ప్రార్థనా మందిరాన్ని మూసివేశారు. అయినా విద్యార్థులు వందేమాతరం పాట పాడటాన్ని కొనసాగించారు. వారు హాస్టల్ వరండాలో పాటను పాడుతూ తమ అభ్యుదయ భావాలను తెలియజేశారు.

రంజాన్ సెలవుల అనంతరం హాస్టల్ 1938 నవంబర్ 28న తిరిగి తెరవబడింది. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను వందేమాతరం పాటను పాడవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా విద్యార్థులు నీలం రంగు షెర్వానీ, పైజామా ధరించాలన్న ఆదేశాలు జారీ చేశారు. దీనికి నిరసనగా B హాస్టల్‌కు చెందిన విద్యార్థి అచ్యుతరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇది 1938 నవంబర్ 29న జరిగింది. దీనివల్ల విద్యార్థులను హాస్టల్ నుండి వెలివేసి సస్పెండ్ చేశారు.

ఉద్యమంలో ప్రముఖుల భాగస్వామ్యం
వందేమాతరం ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పి.వి.నరసింహారావు, మార్రి చెన్నారెడ్డి, ధర్మ భిక్షం, హయగ్రీవాచారి తదితరులు పాల్గొన్నారు. నిజాం ప్రభుత్వం ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను ఇతర విశ్వవిద్యాలయాల్లో చేర్పించవద్దని ఆదేశాలు జారీ చేసింది.

నిజాం కాలేజీకి చెందిన విద్యార్థి నాయకుడు అబిద్ హుస్సేన్ అన్సారీ ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆయనతోపాటు నిజాం కాలేజీకి చెందిన మహదేవ్ సింగ్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు మరికొంతమంది విద్యార్థులు ఈ ఉద్యమాన్ని మద్దతు పలికారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం ప్రభావంతో మహబూబ్ నగర్, నాందేడ్, ఔరంగాబాద్ నగరాల్లో కూడా ఇదే తరహా ఉద్యమాలు చెలరేగాయి.

జాతీయ నాయకుల మద్దతు
మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ నాయకులు ఈ ఉద్యమానికి లేఖల రూపంలో మద్దతు తెలిపారు. ఉద్యమంలో భాగస్వామ్యులైన విద్యార్థులకు ఆశ్రయం కోసం జైన మందిరం ఖాళీగా ఇచ్చారు. భోజనం కోసం వామన్ రావు నాయక్ భవన్ నుండి సహాయం అందింది.

అచ్యుతరెడ్డి కమిటీ
విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఓ కమిటీని నియమించారు. అచ్యుతరెడ్డి ఈ కమిటీకి నాయకత్వం వహించారు. ఈ కమిటీ బెనారస్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ కట్టమంచి రామలింగారెడ్డిలను సంప్రదించి విద్యార్థుల చేర్చుకోమని అభ్యర్ధించారు. అయితే వారు అభ్యర్థనను తిరస్కరించారు.

కేదారనాథ్ పత్రి మద్దతు
నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కేదారనాథ్ పత్రి, ఆర్ట్స్ విద్యార్థులకు జబల్పూర్ కాలేజీలో, సైన్స్ విద్యార్థులకు నాగ్‌పూర్ కాలేజీలో చేరేలా సాయం చేసారు. ఈ చర్యకు ప్రతిగా ఉస్మానియా యూనివర్సిటీ చాన్సిలర్ అక్బర్ హైదరీ, ఇంటర్ యూనివర్సిటీ కౌన్సిల్‌ను ఆశ్రయించి చర్యలు తీసుకోవాలని చూశారు. దీనికి ప్రతిస్పందనగా కేదారనాథ్ పత్రి దేశభక్త విద్యార్థులను ఎక్కడ ఏ యూనివర్సిటీ నుండి నిషేధించినా నేను వారిని చేర్చుకుంటానుఅంటూ ధీమాగా ప్రకటన చేశారు.

వందేమాతరం స్టూడెంట్స్ యూనియన్
జూన్ 1939లో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులు వందేమాతరం స్టూడెంట్స్ యూనియన్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు కమిటీ ఆఫ్ యాక్షన్ ఏర్పడింది. వరదరాజులు అనే ప్రసిద్ధ న్యాయవాది వరంగల్ నుండి ఉత్సాహంగా విరాళాలు అందించారు. కళోజి నారాయణ రావు కూడా నిధుల సేకరణకు సహకరించారు.

ఈ ఉద్యమంలో రామచంద్రరావు గర్వంగా వందేమాతరంఅనే నినాదం హక్కుగా వినిపించారు. ఈ కారణంగా ఆయనను వందేమాతరం రామచంద్రరావుఅని పిలవడం మొదలైంది.

నిజాం ప్రభుత్వం ప్రతిస్పందన
1938 డిసెంబర్ 12న నిజాం ప్రభుత్వం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను అధికారికంగా నిషేధించింది. వారిలో ముఖ్యంగా పి.వి.నరసింహారావు, ధర్మ భిక్షం, అచ్యుతరెడ్డి, మార్రి చెన్నారెడ్డి, హయగ్రీవాచారి, నూకల రామచంద్రరెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ ఉద్యమాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం బలప్రయోగానికి దిగింది. వందలాది మంది విద్యార్థులను విశ్వవిద్యాలయాల నుండి సస్పెండ్ చేసి, ఇతర విద్యా సంస్థల్లో కూడా వారి ప్రవేశానికి అడ్డంకులు సృష్టించింది..

ఉద్యమపు ముగింపు, దీర్ఘకాల ప్రభావం
కఠిన చర్యలతో నిజాం ప్రభుత్వం 1938 డిసెంబర్ 30 నాటికి ఉద్యమాన్ని అణిచివేసింది. అయినప్పటికీ, ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, తుదకు తమ విద్యను పూర్తిచేసి, భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించడంతోపాటు, స్వాతంత్ర్యానంతరం భారతదేశ అభివృద్ధిలో కూడా ముఖ్య భూమిక వహించారు.

ఈ వందేమాతరం ఉద్యమం, విద్యార్థి శక్తి ఎలా దేశ చరిత్రను ప్రభావితం చేయగలదో చూపించిన ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయింది.


హైదరాబాద్‌ - రాజ్యంలోని వందేమాతరం ఉద్యమం, కేవలం ఒక పాటపట్ల ప్రేమ మాత్రమే కాదు. అంతకు మించి అది స్వేచ్ఛ పట్ల గల ఆకాంక్ష, సమాన హక్కుల కోసం పోరాట స్పూర్తి, మరియు దేశభక్తి అనే భావనల సమ్మేళనం. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు విద్యా జీవితం త్యాగం చేసినా, తాము నమ్మిన విలువల కోసం వెనుకడుగు వేయలేదు. స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగ నిర్మాణం, పాలనలో కీలక పాత్ర పోషించిన వారిలో వారు చాలామంది ఉన్నారు. వందేమాతరం ఉద్యమం అంటే కేవలం గీతాన్ని పాడటం కాదు అది అసహనాన్ని శాంతియుతంగా వ్యక్తపరచిన చారిత్రక ఘట్టం. ఈ సంఘటన దేశ చరిత్రలో విద్యార్థి శక్తి సామర్థ్యానికి నిలువెత్తు సాక్ష్యం.

Andhra Mahila Sabha and women movements in Nizam state

 Andhra Mahila Sabha and women movements in Nizam state

ప్రశ్న: ఆంధ్ర మహిళా సభ మరియు మహిళా ఉద్యమాలు

పరిచయం

ఆధునిక భారత మహిళా చరిత్రలో ఆంధ్ర మహిళా సభ ప్రత్యేకమైన స్థానం ప్రత్యేకమైంది. ఇది కేవలం ఒక మహిళా వేదిక కాదు, ఒక మార్గదర్శక సంస్థ, ఒక సమాజ మార్పు ఉద్యమం. 1930లో ఆంధ్ర మహాసభ పరిధిలో స్థాపించబడిన ఈ సంస్థ, స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మహిళల సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక ఉద్యమానికి శక్తివంతమైన ప్రేరణగా నిలిచింది. మహిళల శిక్షణ, అణచివేతకు వ్యతిరేకత, అసంబద్ద సాంప్రదాయాలను ప్రశ్నించడం వంటి అంశాల్లో ఇది కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యానంతరం తెలంగాణ ప్రాంతంలోనూ మహిళా చైతన్యానికి ఇది బలమైన మూలస్తంభంగా నిలిచింది.

ఆవిర్భావం మరియు ప్రారంభ దశలు

ఆంధ్ర మహిళా సభ 1930లో ఆంధ్ర మహాసభలో భాగంగా ఏర్పడింది. ఆంధ్ర మహాసభ స్వాతంత్ర్య ఉద్యమానికి, సమాజ హితానికి కట్టుబడి పని చేస్తూ మహిళా అభ్యున్నతికి ప్రత్యేక వేదిక అవసరమని గుర్తించి, ఈ మహిళా సభను స్థాపించింది. ఆ సమయంలో మహిళలు పరదా, బాల్య వివాహం, దేవదాసి వ్యవస్థలచే బంధించబడి బాధింపబడుతుండగా, ఈ వేదిక వారికి స్వరం ఇచ్చింది. గృహసీమకు మాత్రమే పరిమితమయ్యే మహిళలు ఈ వేదిక ద్వారా తమ సమస్యలను బహిరంగంగా చర్చించగలిగారు.

నాయకత్వం మరియు ప్రధాన కార్యకర్తలు

ఎంతోమంది ధైర్యవంతులూ, చైతన్యవంతులూ అయన మహిళలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. నడింపల్లి సుందరమ్మ, టంగుటూరి వరలక్ష్మమ్మ, మాడపాటి మాణిక్యాంబ, బూర్గుల అనంత లక్ష్మీదేవి, పులిజాల కమలాబాయి వంటి వారు మహిళా చైతన్యంలో గొప్ప దిశానిర్దేశకులుగా నిలిచారు. వారు తమ వ్యక్తిగత జీవితాలను ఉద్యమానికి అంకితం చేశారు. వితంతు వివాహాన్ని ధైర్యంగా అంగీకరించిన వరలక్ష్మమ్మ సమాజంలోని పురాతన భావజాలానికి ధీటుగా నిలిచిన ఒక గొప్ప ఉదాహరణ.

ఆంధ్ర మహాసభతో అనుసంధానం

ఆంధ్ర మహిళా సభ, ఆంధ్ర మహాసభ వేదికల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఒకే దిశగా పోరాడింది. మహిళల సమస్యలు సమాజ హితంలో భాగంగా చర్చించబడ్డాయి. నిజాం ప్రభుత్వానికి మెమోరాండంలు పంపడం, చట్ట సవరణలకు తీర్మానాలు చేయడం ద్వారా సభ తన ప్రాముఖ్యతను చాటింది. మహిళల సమస్యలు స్వతంత్ర ఉద్యమానికి అనుబంధంగా గుర్తించబడ్డాయి.

ముఖ్య సమావేశాలు మరియు చారిత్రక తీర్మానాలు

1930 జోగిపేట సమావేశం ఈ ఉద్యమానికి తొలి బలమైన వేదికను ఇచ్చింది. 1931 దేవరకొండలో జరిగిన సమావేశంలో టంగుటూరి వరలక్ష్మమ్మ పరదా విధానాన్ని వ్యతిరేకించి మాట్లాడారు. 1934 ఖమ్మంలో యెల్లాప్రగడ సీతాకుమారి ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో బాల్య వివాహాలపై తీర్మానాలు ఆమోదించబడ్డాయి. 1935 సిరిసిల్ల లో సమావేశంలో మహిళా సంక్షేమంపై దృష్టి సారించబడింది. 1937 నిజామాబాద్ సమావేశంలో నిజాం రాజాస్థాన ఫర్మానా ద్వారా వితంతు వివాహాలకు అనుమతి రావడం మహిళా ఉద్యమం చరిత్రలో ఘనమైన విజయంగా నిలిచింది. 1940 చిల్కూరు సమావేశంలో పులిజాల కమలాబాయి నాయకత్వంలోని మహిళలు పురుషాధిపత్యాన్ని ధీటుగా ఎదుర్కొని "మా అవసరాలను మేమే నిర్ణయించుకుంటాం" అన్న నినాదం ద్వారా ఉద్యమానికి ఒక బలమైన నినాదాన్ని అందించారు.

సంఘంలో మార్పు తీసుకువచ్చిన ఉద్యమం

ఈ ఉద్యమం క్రమంగా సామాజిక సమస్యల నుండి రాజకీయ ఉద్యమంగా విస్తరించడమే కాకుండా, చట్ట పరంగా మార్పులకు దోహదపడింది. నిజాం ప్రభుత్వానికి నేరుగా విజ్ఞప్తులు చేయడం ద్వారా మహిళల విద్య, ఆస్తి హక్కులు, మరియు మత ఆధారిత అణచివేతలపై చట్ట సవరణలు పొందేందుకు ప్రేరణగా మారింది. మహిళల ఆత్మగౌరవం మరియు స్వీయ హక్కులపై చైతన్యం పెంచడానికి ఈ సంస్థ బలమైన వేదికగా నిలిచింది.

ఆంధ్ర మహిళా సభ మద్రాసు నుండి హైదరాబాద్‌కు విస్తరణ

డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ 1937లో మద్రాసులో ఆంధ్ర మహిళా సభను ప్రారంభించారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి పొందిన అనుభవంతో ఆమెకు మహిళల సమస్యలపై లోతైన అవగాహన ఏర్పడింది. ప్రారంభ దశలోనే ఆమె మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబనను లక్ష్యంగా పెట్టుకుని పలు కార్యక్రమాలు ప్రారంభించారు. వనితా మాహా విద్యాలయం ద్వారా మహిళా విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. 1948లో హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనం అయిన తరువాత, ఆమె ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా సభ హైదరాబాద్ శాఖను ప్రారంభించారు.

హైదరాబాద్ శాఖ సేవల విస్తరణ

హైదరాబాద్ శాఖ ద్వారా పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ప్రాథమిక విద్యా కేంద్రాలు, గర్భిణీ సదుపాయాలు, నర్సింగ్ కోర్సులు, వసతి గృహాలు మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఈ సేవలన్నీ గ్రామీణ ప్రాంతాల మహిళలకు పట్టణాలలో ఉన్న అవకాశాలను అందించాయి. విద్యార్థినులు, అనాథ బాలికలు, వితంతువులు ఇలా అనేక మహిళలు ఈ కేంద్రాల ద్వారా మానవోన్నతిని పొందారు.

హైదరాబాద్ శాఖ ద్వారా:

ప్రాథమిక పాఠశాలలు, నర్సింగ్ కోర్సులు, గర్భిణీ సదుపాయ కేంద్రాలు, విద్యార్థిని వసతి గృహాలు ప్రారంభించబడ్డాయి.

7. ప్రముఖ ప్రాజెక్టులు మరియు విస్తరణ

వసతి గృహాలు:  ఆంధ్ర మహిళా సభ ఆధ్వర్యంలో నడుపబడిన హోస్టళ్ళు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థినులకు హైదరాబాద్ వంటి నగరాల్లో చదువుకోడానికి అద్భుతమైన అవకాశాన్ని కల్పించాయి. గవర్నమెంట్ సహకారంతో కూడిన సంక్షేమ విధానాలకు ఆదర్శంగా నిలిచాయి.

ఆరోగ్య కేంద్రాలు: ప్రసూతి పీడిత మహిళలకు చౌకగా, విశ్వసనీయ వైద్యం, తల్లిదండ్రులు లేకుండా పెరిగే బాలికలకు స్వయం నిబద్ధతపై శిక్షణ, కుటుంబ నియంత్రణపై ప్రచార కార్యక్రమాలు వంటివాటిపై దృష్ఠిసారించారు.

చట్టబద్ధ ఉద్యమంగా పరిణామం

మహిళలకు హక్కులు చట్టబద్ధంగా పొందేందుకు ఆంధ్ర మహిళా సభ కీలకంగా వ్యవహరించింది. వితంతు వివాహాలపై నిషేధం లేని ఫర్మానాలు, వర్ణాంతర సంబంధాల పిల్లలకు వారసత్వ హక్కులు కల్పించే తీర్మానాలు దీని ఆధ్వర్యంలో జరగడం చారిత్రక ఘటనలు. ఇది ఒక చట్టపరమైన ఉద్యమంగా, మహిళల శక్తిని న్యాయ ప్రాతిపదికన సమాజంలో ప్రతిష్ఠించాలన్న ఆశయాన్ని నెరవేర్చింది.

సాంస్కృతిక విప్లవంలో భూమిక

ఈ ఉద్యమం సాంస్కృతిక రంగానికీ విస్తరించి గ్రామీణ మహిళల్లో చైతన్యం పెంచేందుకు బుర్రకథలు, నాటకాలు, పాటల ద్వారా ప్రచారం చేపట్టింది. మాడపాటి మానిక్యాంబ, టంగుటూరి వరలక్ష్మమ్మ లాంటి రచయితలు సాహిత్యాన్ని ఆయుధంగా మలిచి సమాజాన్ని చైతన్యం వైపు నడిపించారు. గ్రామీణ సమాజాన్ని కూడా ఉద్యమం చైతన్యం చేసింది.

విద్యా సంస్థలు:
విద్యా సంస్థ పేరు - స్థాపిత సంవత్సరం - విశేషాలు
1940 లో వనితా మహా విధ్యాలయ ను మద్రాసులో ప్రారంభించారు. మొదట ఇది కళాశాలగా ప్రారంభం అయింది. 1958 లో ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల హైదరాబాదులో ప్రారంభించబడింది. దీనికి విశ్వవిధ్యాలయ UGC గుర్తింపు ఉంది.
1960 లో ఇన్స్టిట్టూట్ ఆఫ్ మెడికల్ సోషల్ వర్క్ వైద్య సామాజిక సేవలో శిక్షణ కోసం స్దాపించబడింది.
1971  లో కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ విమెన్ అనే పేరుతో మహిళల కోసం ప్రత్యేక బి.ఎడ్ కళాశాల స్దాపించబడింది.

దేశవ్యాప్తంగా గుర్తింపు

ఈ సంస్థ సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. జవహర్‌లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, రాధాకృష్ణన్ లాంటి నాయకులు సభ సేవలను ప్రశంసించారు. UNESCO వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి గుర్తింపు లభించింది. ఆ సంస్థకు చెందిన విద్యార్థినులలో ఎందరో వైద్యులు, ఉపాధ్యాయులు, IAS అధికారులుగా ఎదిగారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఇది దోహదపడింది.

వారసత్వం మరియు ప్రభావం

ఆంధ్ర మహిళా సభ ద్వారా ఏర్పడిన చైతన్యం తరం తరానికి మార్గదర్శిగా నిలిచింది. గ్రామీణ స్థాయిలోనూ మహిళలలో చట్టబద్ధతపై అవగాహన పెరిగింది. ఇది ఒక ప్రాంతీయ ఉద్యమంగా ప్రారంభమై, జాతీయ మహిళా చైతన్యంలో ఒక విశిష్టమైన అధ్యాయంగా నిలిచింది. సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నిలిచి, మహిళల స్వేచ్ఛకు మార్గం వేసిన ఉద్యమంగా ఇది నిలిచింది.

ముగింపు

ఆంధ్ర మహిళా సభ అనేది కేవలం సేవా కార్యక్రమాల పరిమితికి లోబడిన సంస్థ కాదు. ఇది సమాజ మార్పు కోసం పోరాడిన మహిళా చైతన్య ఉద్యమం. ఇది తెలుగు మహిళల ఆత్మగౌరవానికి, విద్యాభివృద్ధికి, హక్కుల సాధనకు మార్గదర్శిగా నిలిచింది. అనేక విభాగాలలో దీని విజయాలు కనిపిస్తున్నా, అసలు గమ్యం సమానత్వం, స్వావలంబన కోసం పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్యమం ఒక చరిత్ర కాదు, ఒక జీవన తత్వం ఎందుకంటే ఇది మహిళలు తమ జీవితాలను తాము నిర్మించుకోవాలన్న ఆశయాన్ని నమ్మింది, పోరాడింది, ఆ కలను నిజం చేసింది.

UGC JRF NET Paper 1 mock test 1 in English

UGC JRF NET Paper 1 mock test 1 in English UGC JRF NET Paper 1 mock test 1 in English UGC JRF NET Paper 1 ...