Mulki movement in Deccan Hyderabad State
డెక్కన్ మరియు హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం - Download audio
పరిచయం
‘ముల్క్’ అనగా మాతృభూమి. హైదరాబాద్ రాష్ట్రంలోని స్థానిక ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలలో తమ హక్కుల కోసం ఇతర ప్రాంతాలనుండి వచ్చి స్థిరపడిన వారిపై పోరాడిన సంఘటనను ముల్కీ ఉద్యమం అంటారు. ఈ ఉద్యమం హైదరాబాద్‌లో మధ్యయుగం నుండి పలుమార్లు జరిగింది. ముల్కీ ఉధ్యమం బహమనీల కాలంలో మొదటిసారిగా జరిగింది. ఈ ఉద్యమం స్థానిక దక్కనీలు మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అపాకీల మధ్య సంఘర్షణల చరిత్రను వెల్లడిస్తుంది, ఇది సామాజిక, రాజకీయ మరియు భాషా సమస్యలతో ముడిపడి ఉంది.
బహమనీ కాలంలో ముల్కీ సంఘర్షణలు
ఖిల్జీలు మరియు తుగ్లక్‌ల దక్షిణ భారత దండయాత్రల సమయంలో, ఉత్తర భారతదేశం నుండి కొంతమంది హిందువులు మరియు ముస్లింలు హైదరాబాద్ రాష్ట్రంలో స్థిరపడ్డారు. వీరు స్థానిక దక్కనీలతో కలిసిపోయారు. బహమనీ సుల్తానుల పాలనలో, ఇరానీలు, ఇరాకీలు మరియు టర్క్-లు దక్షిణ భారతదేశానికి వచ్చి ప్రముఖ స్థానాలను ఆక్రమించారు. వీరిని అపాకీలు అని పిలిచారు. అపాకీలు వ్యాపారంలో స్థిరపడి, ప్రభుత్వ రాయితీలను ఉపయోగించుకొని ధనవంతులై, రాజ్యంలో ముఖ్యమైన పదవులను సంపాదించారు. దక్కనీలు రెండవ స్థాయి పౌరులుగా మిగిలిపోయారు. ఈ అసమానత దక్కనీలలో అసంతృప్తిని రేకెత్తించింది. సున్నీ మరియు షియా విభేదాలు ఈ సంఘర్షణను మరింత తీవ్రతరం చేశాయి, ఎందుకంటే అపాకీలు సున్నీలు, దక్కనీలు షియాలు. బహమనీ సైన్యంలోని సిపాయిలు దక్కనీలు కాగా, వారి సహాయ నిరాకరణ కారణంగా మొదటి అహ్మద్ షా గుజరాత్ తో యుధ్ధంలో ఓడిపోయాడు. మొదటి అహ్మద్ షా, రెండవ అహ్మద్ షా, మూడవ అహ్మద్ షా ల కాలంలో ప్రధానమంత్రి పదవులను అపాకీలు ఆక్రమించారు. మహ్మద్ గవాన్, ఒక అపాకీ. మూడవ అహ్మద్ షా ప్రధానమంత్రిగా మహ్మద్ గవాన్ సంక్షేమ చర్యలలో విజయవంతమైనప్పటికీ, బీదర్‌లో స్థాపించిన విశ్వవిద్యాలయంలో అపాకీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దక్కనీలు మరింత వెనుకబడ్డారు. ఈ అసమానత బహమనీ రాజ్య విచ్ఛిన్నానికి దారితీసింది.
కుతుబ్ షాహీల కాలంలో సామరస్యం
కుతుబ్ షాహీ వంశ స్థాపకుడైన కులీ కుతుబ్ షా, అపాకీ అయినప్పటికీ, దక్కనీలపై వివక్ష చూపలేదు. బహమనీ విచ్ఛిన్నం నుండి పాఠాలు నేర్చుకొని, అతను స్థానిక దక్కనీలకు ముఖ్యమైన పదవులను అప్పగించాడు మరియు తెలుగు భాషను ప్రోత్సహించాడు. అబుల్ హసన్ తానిషా కాలంలో అక్కన్న అనే ఒక హిందువు ప్రధానమంత్రిగా, అతని సోదరుడు మాదన్న ‘పేష్కర్’గా నియమించబడ్డారు. స్థానిక భాష మరియు సంస్కృతిని గౌరవించినందున, కుతుబ్ షాహీల కాలంలో ముల్కీ సంఘర్షణలు ఉత్పన్నం కాలేదు.
ఆసఫ్‌జాహీల కాలంలో ముల్కీ సమస్యలు
1857 తిరుగుబాటు తర్వాత మొఘల్ సామ్రాజ్యం తోపాటూ కొన్ని స్థానిక రాజ్యాలు అంతమయ్యాయి. ఉద్యోగాలు కోల్పోయిన అధికారులు, కళాకారులు, కవులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అది అప్పటికి శాంతియుత ప్రాంతంగా ఉంది. ఐదవ నిజాం అఫ్జల్ ఉద్దౌలా కాలంలో, ప్రధానమంత్రి సలార్‌జంగ్ హైదరాబాద్ 1882 లో సివిల్ సర్వీసెస్‌ను పరిచయం చేసి, అలీగఢ్ విశ్వవిద్యాలయం నుండి విద్యావంతులను ఆహ్వానించాడు. వారు స్థానికులకు శిక్షణ ఇవ్వాలని ఆశించినప్పటికీ, బదులుగా హైదరాబాద్‌లో స్థిరపడి, తమ బంధువులకు ఉద్యోగాలు వచ్చేలా చేసుకున్నారు. దీనివల్ల దక్కనీలు ప్రభుత్వ ఉద్యోగాలలో మైనారిటీగా మారారు, మరోసారి ముల్కీ మరియు నాన్-ముల్కీ సంఘర్షణ తలెత్తింది.
1880లో, ఆరవ నిజాం మహబూబ్ అలీ పాలనలో, ఉర్దూ అధికారిక భాషగా మారింది. ఆంగ్లం తప్పనిసరి భాషగా చేయబడింది. స్థానికులలో ఉర్దూ మరియు ఆంగ్లంలో నిష్ణాతులు తక్కువగా ఉండటం వల్ల, బయటి వారు ముఖ్య పదవులను ఆక్రమించారు. ఆంగ్లం మాట్లాడే వారికి ఎక్కువ వేతనం చెల్లించబడటం స్థానికులను మరింత వెనుకబాటుకు గురి చేసింది, దీనివల్ల ముల్కీ ఉద్యమం మళ్లీ ఉద్భవించింది. ప్రభుత్వం స్పెషల్ హైదరాబాద్ సివిల్ సర్వీసెస్‌ను పరిచయం చేసి, స్థానికులకు పదవులు ఇచ్చింది.
బ్రిటిష్ జోక్యం మరియు ముల్కీ ఉద్యమం
బ్రిటిష్‌వారు హైదరాబాద్ రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకోవడంతో, ఎక్కువ బ్రిటిష్ అధికారులను నియమించారు. కాసన్ వాకర్ 1912 వరకు ఆర్థిక మంత్రిగా ఉండి, నాన్-ముల్కీలను ఉద్యోగాలలో నియమించాడు. మహారాజా సర్ కిషన్ పర్షాద్ ముల్కీల హక్కుల కోసం పోరాడి, నాన్-ముల్కీలను తాత్కాలిక ఉద్యోగులుగా ప్రకటించేలా చేశాడు, స్థానికులకు ఉన్నత పదవులు వచ్చేలా చేసాడు. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపన తర్వాత, ఉత్తర భారతదేశం నుండి వచ్చిన పండితులు లక్నవీ ఉర్దూను ప్రామాణికంగా ప్రకటించి, దక్కనీ ఉర్దూను తక్కువగా చూశారు, ఈ భాషా ఆధిపత్యం 1948లో పోలీసు చర్య వరకు కొనసాగింది.
నిజాం ఫర్మానాలు మరియు ముల్కీ నియమాలు
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919 ఫర్మాన్ ముల్కీ నియమాలను నిర్దేశించింది. దీని ప్రకారం హైదరాబాద్‌లో జన్మించిన వారు మరియు 15 సంవత్సరాలు నిరంతరం నివసించి, స్వదేశానికి తిరిగి వెళ్లే ఉద్దేశ్యం లేని వారు ముల్కీలుగా పరిగణించబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ముల్కీలను మాత్రమే నియమించాలని 1933 ఫర్మాన్ మరోసారి నొక్కిచెప్పింది. 1934లో ‘నిజాం ప్రజల సంఘం’ స్థాపించబడింది, సర్ నిజామత్ జంగ్ అధ్యక్షుడిగా, ‘హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్’ నినాదంతో ముల్కీల హక్కులను కాపాడింది.
ఆంధ్ర ప్రజల ఆగమనం మరియు సంఘర్షణ
1948 పోలీసు చర్య మరియు 1952 సాధారణ ఎన్నికల మధ్య, ఆంధ్ర ప్రాంతం నుండి చాలామంది హైదరాబాద్‌కు వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలలో చేరారు. మద్రాసు నుండి వెళ్ళగొట్టబడ్డ అవినీతి ఆంధ్ర అధికారులు తెలంగాణకు వచ్చి ఇక్కడ అవినీతపర కార్యక్రమాలు చేసేవారు. బ్రిటిష్ పాలనలో శిక్షణ పొందిన ఆంధ్ర వ్యక్తులు తెలంగాణ ఉద్యోగాలలో నియమించబడ్డారు. వారు తమ బంధువులను తీసుకొచ్చి వారికీ ఉద్యోగాలు వచ్చేలా చేసారు. కొందరు వ్యాపారాలు స్థాపించారు. ఆంధ్ర ప్రజలు ఉర్దూ మిశ్రిత తెలంగాణ తెలుగును అవమానించారు, తమను ఉన్నతమైన సంస్కృతి కలవారుగా, తెలంగాణవాసులను అనాగరికులుగా చిత్రీకరించారు. నకిలీ ముల్కీ సర్టిఫికెట్లతో ముల్కీ చట్టాన్ని ఉల్లంఘించారు. లంచం వంటి అవినీతిని ప్రోత్సహించారు.
వరంగల్‌లో ముల్కీ ఉద్యమం
వరంగల్ విద్యార్థులు ముల్కీ సర్టిఫికెట్ జారీ నియమాలు, నకిలీ సర్టిఫికెట్ల రద్దు, ధృవీకరణ తర్వాతనే ముల్కీ సర్టిఫికెట్ల జారీ కోసం ఉద్యమం ప్రారంభించారు. ఈ డిమాండ్లను కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ ఎ. బుచ్చయ్య తీర్మానంగా ప్రకటించాడు. ఆగస్టు 7న ఖమ్మం విద్యార్థులు కూడా నాన్-ముల్కీలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. వరంగల్‌లో డివిజనల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ పార్థ సారధి 180 మంది స్థానిక ఉపాధ్యాయులను బదిలీ చేసి, నాన్-ముల్కీ ఉపాధ్యాయులతో భర్తీ చేశాడు, దీనిని విద్యార్థులు ఖండించారు. 26 జూలై 1952న విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పడింది, బుచ్చయ్య కన్వీనర్‌గా ఎన్నికయ్యాడు. హన్మకొండ నుండి సుబేదారి వరకు ర్యాలీ నిర్వహించబడింది. రామచారి హైదరాబాద్ హిత రక్షణ సమితిని స్థాపించి, ‘గైర్ ముల్కీ గో బ్యాక్’ నినాదాన్ని ఇచ్చాడు. హయగ్రీవ చారి, కేశవరావు జాదవ్ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.
హైదరాబాద్‌లో ముల్కీ ఉద్యమం
31 ఆగస్టు 1952న, హన్మకొండలో విద్యార్థులపై లాఠీ ఛార్జీకి నిరసనగా హైదరాబాద్ విద్యార్థులు సమ్మె నిర్వహించారు. సైఫాబాద్ కాలేజీ నుండి ఆబిడ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడింది. 1 సెప్టెంబర్ 1952, బక్రీద్ సందర్భంగా సమ్మెలు లేవు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ శివకుమార్ లాల్ విధ్యార్దుల తల్లిదండ్రులను హెచ్చరించాడు. 2 సెప్టెంబర్ 1952న, ‘నాన్ ముల్కీ గో బ్యాక్’, ‘ఇడ్లీ సాంబార్ ఘర్ కో జావో’, ‘స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్’ నినాదాలతో విద్యార్థులు ఆందోళన చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని అన్ని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు 30 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ వరకు నిరసనల్లో పాల్గొన్నారు. 3 సెప్టెంబర్ 1952న, శివకుమార్ లాల్ ఆందోళనలను నిషేధించాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ విద్యార్థులను నియంత్రించే ప్రయత్నం విఫలమైంది. సిటీ కాలేజీ, పత్తర్‌ఘాట్ వద్ద పోలీసులు కాల్పులు జరిపారు, జస్టిస్ పింగళి జగన్ మోహన్ రెడ్డి నివేదిక ప్రకారం ఇద్దరు మరణించారు. 4 సెప్టెంబర్ 1952న, మృతదేహాల అప్పగింత కోసం ఆందోళనలు జరిగాయి. మరో నలుగురు కాల్పుల్లో మరణించారు. ఈ సంఘటనల్లో 147 విద్యార్థులు, 104 పోలీసులు గాయపడ్డారు. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు విద్యార్థులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఆందోళనలు ఆగలేదు. వీ.డీ. దేశ్ పాండే, ఓంకార్ ప్రసాద్, డాక్టర్ జయ సూర్య నాయుడు, పద్మజ నాయుడు, శ్రీ డాంగే, డాక్టర్ మెల్కోట్, బకర్ అలీ మిర్జా, వెంకట స్వామి నాన్-ముల్కీలకు మద్దతు ఇచ్చారు. బూర్గుల రామకృష్ణ రావు, స్వామి రామానంద తీర్థ నాన్-ముల్కీలకు అనుకూలంగా ప్రకటనలు ఇచ్చారు. సెప్టెంబర్ 3న ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. శాంతియుత ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు, దీనివల్ల ఇద్దరు విద్యార్థులు మరణించి, అనేకమంది గాయపడ్డారు. విద్యార్థులు పోలీసు స్టేషన్‌లను తగలబెట్టారు, దీనివల్ల కర్ఫ్యూ విధించబడింది. జయశంకర్, కాళోజీ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. మొత్తం 18 మంది కాల్పుల్లో మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. ప్రభుత్వం 350 మందిని అరెస్టు చేసి, హింసించింది, ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసింది.
No comments:
Post a Comment