Vandemataram movement in Nizam state

Vandemataram movement in Nizam state 

ప్రశ్న: హైదరాబాద్ రాష్ట్రంలోని వందేమాతరం ఉద్యమం (29 నవంబర్ 1938 నుండి 30 డిసెంబర్ 1940)

పరిచయం: download audio of this answer
వందేమాతరం ఉద్యమం భారత స్వాతంత్ర్య సమరంలో ఓ గొప్ప మలుపుగా నిలిచింది. దేశమంతటా ఈ పాట ఒక చైతన్య గీతంగా మారినప్పటికీ, హైదరాబాద్ రాష్ట్రంలో దీనిపై నిషేధం విధించబడటం విద్యార్థుల్లో ఆందోళనకు దారితీసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ పాట పాడిన విద్యార్థులు, ప్రభుత్వం దృష్టిలో తిరుగుబాటు కారులుఅయ్యారు. పాట ద్వారా వారు వ్యక్తీకరించిన ప్రేమ దేశం పట్ల గల నిజమైన అంకితభావాన్ని చూపించింది. ఈ ఉద్యమం యువకులలో ఉన్న దేశభక్తిని, తమ హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని ప్రపంచానికి చూపించింది. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు విద్యార్థి శక్తి ఇచ్చిన గట్టి సమాధానంగా ఈ ఉధ్యమం నిలిచింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవిర్భావం
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1917 ఏప్రిల్ 26న ఓ ఫర్మాను జారీ చేశారు, దీని ద్వారా ఓ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలన్న నిర్ణయం వెలువడింది. ఫలితంగా, 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. అనంతరం 1919 ఆగస్టు 28న ఆర్ట్స్ కళాశాల కార్యకలాపాలు ప్రారంభించాయి.

వందేమాతరం పాట పరిచయం
వందేమాతరంఅంటే తల్లికి వందనంఅని అర్థం. ఈ పాటను తొలుత దేవీ దుర్గమ్మకు అంకితంగా రచించారు. తరువాత దీన్ని భారత మాతకు అంకితంగా భావించారు. ఆనంద మఠ్అనే బంగ్లా నవల రచయిత బంకించంద్ర చటర్జీ దీనిని రచించారు. ఈ నవలలో వందేమాతరం పాట భాగంగా ఉంటుంది. వాసుదేవ్ బాలవంతరావ్ ఫడ్కే చేసిన స్వాతంత్ర్య పోరాటం ఆనంద మఠ్ నవలకు ప్రేరణగా నిలిచింది. ఈ నవల నేపథ్యం సంయాసి తిరుగుబాటు (Sanyasi Rebellion).

1896లో ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతరం పాటను తొలిసారిగా స్వరపరిచారు. ఇది భారతదేశంలోని స్వాతంత్ర్య సమరయోధులకు గొప్ప ప్రేరణగా నిలిచింది. 1905లో వారణాసిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో ఈ పాటను జాతీయ గీతంగా ప్రకటించారు. అదే సభలో సారలాదేవి చౌదురానీ ఈ పాటను ఆలపించారు. ఆ సమావేశానికి అధ్యక్షత వహించినవారు దాదాభాయ్ నౌరోజి.

హైదరాబాద్‌లో వందేమాతరం ఉద్యమం ఎలా ప్రారంభమైంది?
1938లో దసరా పండుగ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం B హాస్టల్ విద్యార్థులు వందేమాతరం పాటను ఆలపించారు. అయితే అంతకు మునుపే ఈ పాటపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. హాస్టల్‌లో ఉన్న హిందూ ప్రార్థనా మందిరంలో ఈ పాట పాడటాన్ని ముస్లిం విద్యార్థులు వ్యతిరేకించి యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూనివర్సిటీ అధికారులు ప్రార్థనా మందిరాన్ని మూసివేశారు. అయినా విద్యార్థులు వందేమాతరం పాట పాడటాన్ని కొనసాగించారు. వారు హాస్టల్ వరండాలో పాటను పాడుతూ తమ అభ్యుదయ భావాలను తెలియజేశారు.

రంజాన్ సెలవుల అనంతరం హాస్టల్ 1938 నవంబర్ 28న తిరిగి తెరవబడింది. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను వందేమాతరం పాటను పాడవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా విద్యార్థులు నీలం రంగు షెర్వానీ, పైజామా ధరించాలన్న ఆదేశాలు జారీ చేశారు. దీనికి నిరసనగా B హాస్టల్‌కు చెందిన విద్యార్థి అచ్యుతరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇది 1938 నవంబర్ 29న జరిగింది. దీనివల్ల విద్యార్థులను హాస్టల్ నుండి వెలివేసి సస్పెండ్ చేశారు.

ఉద్యమంలో ప్రముఖుల భాగస్వామ్యం
వందేమాతరం ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పి.వి.నరసింహారావు, మార్రి చెన్నారెడ్డి, ధర్మ భిక్షం, హయగ్రీవాచారి తదితరులు పాల్గొన్నారు. నిజాం ప్రభుత్వం ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను ఇతర విశ్వవిద్యాలయాల్లో చేర్పించవద్దని ఆదేశాలు జారీ చేసింది.

నిజాం కాలేజీకి చెందిన విద్యార్థి నాయకుడు అబిద్ హుస్సేన్ అన్సారీ ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆయనతోపాటు నిజాం కాలేజీకి చెందిన మహదేవ్ సింగ్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు మరికొంతమంది విద్యార్థులు ఈ ఉద్యమాన్ని మద్దతు పలికారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం ప్రభావంతో మహబూబ్ నగర్, నాందేడ్, ఔరంగాబాద్ నగరాల్లో కూడా ఇదే తరహా ఉద్యమాలు చెలరేగాయి.

జాతీయ నాయకుల మద్దతు
మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ నాయకులు ఈ ఉద్యమానికి లేఖల రూపంలో మద్దతు తెలిపారు. ఉద్యమంలో భాగస్వామ్యులైన విద్యార్థులకు ఆశ్రయం కోసం జైన మందిరం ఖాళీగా ఇచ్చారు. భోజనం కోసం వామన్ రావు నాయక్ భవన్ నుండి సహాయం అందింది.

అచ్యుతరెడ్డి కమిటీ
విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఓ కమిటీని నియమించారు. అచ్యుతరెడ్డి ఈ కమిటీకి నాయకత్వం వహించారు. ఈ కమిటీ బెనారస్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ కట్టమంచి రామలింగారెడ్డిలను సంప్రదించి విద్యార్థుల చేర్చుకోమని అభ్యర్ధించారు. అయితే వారు అభ్యర్థనను తిరస్కరించారు.

కేదారనాథ్ పత్రి మద్దతు
నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కేదారనాథ్ పత్రి, ఆర్ట్స్ విద్యార్థులకు జబల్పూర్ కాలేజీలో, సైన్స్ విద్యార్థులకు నాగ్‌పూర్ కాలేజీలో చేరేలా సాయం చేసారు. ఈ చర్యకు ప్రతిగా ఉస్మానియా యూనివర్సిటీ చాన్సిలర్ అక్బర్ హైదరీ, ఇంటర్ యూనివర్సిటీ కౌన్సిల్‌ను ఆశ్రయించి చర్యలు తీసుకోవాలని చూశారు. దీనికి ప్రతిస్పందనగా కేదారనాథ్ పత్రి దేశభక్త విద్యార్థులను ఎక్కడ ఏ యూనివర్సిటీ నుండి నిషేధించినా నేను వారిని చేర్చుకుంటానుఅంటూ ధీమాగా ప్రకటన చేశారు.

వందేమాతరం స్టూడెంట్స్ యూనియన్
జూన్ 1939లో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులు వందేమాతరం స్టూడెంట్స్ యూనియన్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు కమిటీ ఆఫ్ యాక్షన్ ఏర్పడింది. వరదరాజులు అనే ప్రసిద్ధ న్యాయవాది వరంగల్ నుండి ఉత్సాహంగా విరాళాలు అందించారు. కళోజి నారాయణ రావు కూడా నిధుల సేకరణకు సహకరించారు.

ఈ ఉద్యమంలో రామచంద్రరావు గర్వంగా వందేమాతరంఅనే నినాదం హక్కుగా వినిపించారు. ఈ కారణంగా ఆయనను వందేమాతరం రామచంద్రరావుఅని పిలవడం మొదలైంది.

నిజాం ప్రభుత్వం ప్రతిస్పందన
1938 డిసెంబర్ 12న నిజాం ప్రభుత్వం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను అధికారికంగా నిషేధించింది. వారిలో ముఖ్యంగా పి.వి.నరసింహారావు, ధర్మ భిక్షం, అచ్యుతరెడ్డి, మార్రి చెన్నారెడ్డి, హయగ్రీవాచారి, నూకల రామచంద్రరెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ ఉద్యమాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం బలప్రయోగానికి దిగింది. వందలాది మంది విద్యార్థులను విశ్వవిద్యాలయాల నుండి సస్పెండ్ చేసి, ఇతర విద్యా సంస్థల్లో కూడా వారి ప్రవేశానికి అడ్డంకులు సృష్టించింది..

ఉద్యమపు ముగింపు, దీర్ఘకాల ప్రభావం
కఠిన చర్యలతో నిజాం ప్రభుత్వం 1938 డిసెంబర్ 30 నాటికి ఉద్యమాన్ని అణిచివేసింది. అయినప్పటికీ, ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, తుదకు తమ విద్యను పూర్తిచేసి, భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించడంతోపాటు, స్వాతంత్ర్యానంతరం భారతదేశ అభివృద్ధిలో కూడా ముఖ్య భూమిక వహించారు.

ఈ వందేమాతరం ఉద్యమం, విద్యార్థి శక్తి ఎలా దేశ చరిత్రను ప్రభావితం చేయగలదో చూపించిన ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయింది.


హైదరాబాద్‌ - రాజ్యంలోని వందేమాతరం ఉద్యమం, కేవలం ఒక పాటపట్ల ప్రేమ మాత్రమే కాదు. అంతకు మించి అది స్వేచ్ఛ పట్ల గల ఆకాంక్ష, సమాన హక్కుల కోసం పోరాట స్పూర్తి, మరియు దేశభక్తి అనే భావనల సమ్మేళనం. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు విద్యా జీవితం త్యాగం చేసినా, తాము నమ్మిన విలువల కోసం వెనుకడుగు వేయలేదు. స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగ నిర్మాణం, పాలనలో కీలక పాత్ర పోషించిన వారిలో వారు చాలామంది ఉన్నారు. వందేమాతరం ఉద్యమం అంటే కేవలం గీతాన్ని పాడటం కాదు అది అసహనాన్ని శాంతియుతంగా వ్యక్తపరచిన చారిత్రక ఘట్టం. ఈ సంఘటన దేశ చరిత్రలో విద్యార్థి శక్తి సామర్థ్యానికి నిలువెత్తు సాక్ష్యం.

No comments:

Post a Comment